శ్రీనాథ విరచిత పద్యము



 

శ్రీనాథ మహాకవి వ్రాసిన ఒక అందమయినపద్యం

పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ "భీమఖండము" లో ఎంత అందంగా చిత్రించాడో చూడండి. ఆ ఆది దంపతుల దివ్యదర్శనం అవుతుంది. 


చంద్రబింబానన, చంద్రరేఖామౌళి 

          నీలకుంతలభార, నీలగళుఁడు 

ధవళాయతేక్షణ, ధవళాఖిలాంగుండు 

          మదనసంజీవని, మదనహరుఁడు 

నాగేంద్రనిభయాన, నాగకుండలధారి 

          భువనమోహనగాత్ర , భువనకర్త 

గిరిరాజకన్యక, గిరిరాజనిలయుండు 

          సర్వాంగసుందరి, సర్వగురుఁడు 


గౌరి శ్రీ విశ్వనాథుండు కనక రత్న

పాదుకలు మెట్టి చెట్టలు పట్టుకొనుచు

ఏగుదెంచిరి వయ్యార మెసగ మెసగ

విహరణక్రీడ మాయున్న వేదికపుడు


పద్యములోని నాలుగు పాదాల్లోనూ పార్వతిని,పరమేశ్వరుణ్ణి స్తుతించాడు శ్రీనాథమహాకవి!

పార్వతీదేవిచంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. . మరి, శివుడేమో చంద్రరేఖను తలపై కలిగినవాడు.


 నల్లని కాటుక వంటి దట్టమైన కురులను కలిగివుంది అమ్మ ...

అయ్యవారి కంఠము నల్లనిది . 

ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. 

అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు.

చనిపోయిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల దయార్ద్రహృదయఆ తల్లి. 

ఆయనేమో తన మూడోకంటితోమన్మధుణ్ణి భస్మం చేసినవాడు.

ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (' నాగము ' అంటే ఏనుగు )! 

మరి, శివుడేమో నాగాభరణుడు. 

సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. 

ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.

ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. 

ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.

అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. 

ఆయన సర్వులకూ గురువు; జగద్గురువు.

         ఆ ఆదిదంపతులు, చెట్టపట్టాలు వేసుకొని హాయిగా విహరిస్తూ వయ్యారంగా మేమున్న చోటికి వచ్చినారు. 

మహాదేవుడు   అర్ధనారీశ్వరుడు.

ఆ తల్లినీ తండ్రినీ 

ఇద్దరికీ ఒకేవిశేషణాలు వాడుతూ కవిసార్వభౌముడి గంటము నుండి జాలువారిన అద్భుత పద్య ప్రసూనమిది...

వూటుకూరు జానకిరామారావు గారి ముఖచిత్రపు గోడ మీదనించి.... 

Comments

Popular posts from this blog

SRI VIDYA GANAPATI VANCHA KALPALATA MANTRA

My Father - Lives Ever

My Father - My Hero