నా జీవితంలో స్త్రీ మూర్తులు
నా బామ్మని నేను ఎరగను.
నా అమ్మమ్మ కి నేనంటే వల్లమాలిన అభిమానం. శివా అంటూ పిలిచేది. కకిలేర్లో కరెంట్ లేని రోజుల్లో రాత్రుళ్ళు పుడుకోబోయే ముందు చీకట్లో దడుసుకుంటూ అమ్మమా రావే ....ఒక్క కధ చెప్పవే అని పిలిచేవాళ్ళం. ఆవిడికి అప్పటికే వినపడేది కాదు. పది సార్లు పిలిస్తే గానీ వచ్చేది కాదు. వచ్చాకా ...కోటలూ, తోటలూ, రాజ కుమారులూ, గుర్రాలూ, కత్తి యుద్ధాలూ, సాము గరిడీలూ, అందమైన పడుచులూ, రాక్షసులూ, దెయ్యాలూ, అమ్మవార్లూ, అలాఅలా ఎందరెందరో మా మనో ఫలకాల మీద ప్రత్యక్షమై, వాళ్ళ పాత్రలు పోషించి కనుమరుగై పోయేవారు. నాలో ఏమన్నా సృజనాత్మకత వుంటే..... అది అమ్మమ్మ చలవే.
నాకు వున్న ముగ్గురి మేనత్త లలోనూ నేను ఇద్దరినే ఎరుగుదును. పెద్దామె నాకు తెలిసేతప్పటికీ ఎనభై లలో వుండేది. మల్లెపువ్వు లాంటి, మడత నలగని చీర కట్టుకునేది. ఆమె మెడలో తళ్ళుక్కు మనే పగడాల దండ నాకు ఇంకా గుర్తే. చిన్న మేనత్త మమ్మల్ని బస్సుల్లో వాళ్ళ వూరు తీసుకెళ్ళేది. బస్సులు మారడం, రిక్షాలు ఎక్కడం నా చిన్న మేనత్త నేర్పినవే.
నా మేన మామల భార్యలు ముగ్గురు. ఆప్యాయంగా పలకరించడం, కబుర్లు చెప్పడం, మర్యాదలు చెయ్యడం, వగైరాలనన్నీ వాళ్ళు నేర్పిన విద్యలే.
నా తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి వ్రాయ గలిగేంత భాష నాకు లేదు. ఇక్కటి మట్టుకు నిజం. నాకు అమ్మ గుర్తు వచ్చినప్పుడల్లా నా కళ్ళు చెమరుస్త్తాయి. సంతోషమూ, విచారమూ కలగా పులగ మైపోతాయి. గొంతు వణుకుతుంది. నా తల్లి అక్క గారికి నేనంటే ఎంతో గురి. నా తెలివితేటల మీద, నా సామర్ధ్యం మీద అపారమైన నమ్మకం.
నా అమ్మ తరవాత అమ్మలంత వాళ్ళు నా చెల్లెళ్ళు. భగవంతుడు నాకు ఇచ్చిన వరాలు. నాకు పిల్ల నిచ్చిన నా అత్తగారి ఋణం తీరనిది.
ఇంకా నా భార్య. నన్ను భరిస్తూ, నా బాధ్యతల ని మోస్తూ, వున్న దాంతో సర్దు కుంటూ, నాకు చేదోడు వాదోడు గా ఉంటూ, నన్ను పరిపూర్ణమైన మనిషిని చేసిన ఇల్లాలు. నా భార్యా, చెల్లెళ్ళూ బహుముఖ ప్రజ్ఞ కలవారు.
నా వదినలూ, నా మరదళ్ళూ, నా మేన కోడళ్ళూ, నా కూతురి వరస వారు, అందరూ బంగారాలే. పూర్వ జన్మ సుకృతం వల్ల నాకు దక్కిన వాళ్ళు.
ఇంక నా కోడలు. కూతురు లాంటి కోడలు. మళ్ళీ నా యింటికి నా అమ్మ ని తీసుకు వచ్చిన తల్లి.
వీళ్ళు కాక ఎందరో.... నా చిన్న నాటి నేస్తాలు, నా తో చదువుకున్న వాళ్ళు, నా సహ ఉద్యోగినులు. నా స్నేహితుల భార్యలు...నాకు, నా వాళ్లకి వైద్యం చేసిన వైద్యులు, చదువులు చెప్పిన ఉపాద్యాయురాళ్లు, నన్ను అన్నయ్యా అంటూ పిలిచే నా చెల్లాయిల స్నేహితురాళ్ళు ...
ఇంతేనా?
కూరలమ్మి, పాలు పోసే అమ్మి, మా ఇంటి పని అమ్మి, ఎంత మంది స్త్రీ మూర్తుల సేవల నందుకుని ఇంతవాడిని అయ్యాను? తెలిసిన అమ్మలకి, తెలియని తల్లులకీ ....
ఎందరో మహానుభావురాళ్ళు ...అందరికీ అభినందనలు. జేజేలు. జోహార్లు.
Comments
Post a Comment